వారానికి మూడు నాలుగు సినిమాలొస్తుంటాయి. వాటిలో ప్రేక్షకుల దృష్టి పడేది ఒక్క సినిమాపైనే. ఎన్ని సినిమాలొచ్చినా ఏ సినిమా కోసం థియేటర్‌కి వెళ్లాలి? దేన్ని ఓటీటీలో చూడాలి? అనేది ప్రేక్షకుడు ట్రైలర్ చూసి ఫిక్సయిపోతున్నాడు. అంటే... ఓ సినిమా జాతకాన్ని నిర్ణయించేది ట్రైలరే అన్నమాట. ఈమధ్య కాలంలో కొత్త సినిమాల హడావుడి బాగా ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రతీ వారం.. సినిమాలు బాక్సాఫీసు మీదకు పోటెత్తుతున్నాయి. అయితే.. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ జాబితాలో కచ్చితంగా `సీతారామం` సినిమాకి చోటిచ్చేయొచ్చు.
ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపొందిన సినిమా `సీతారామం`.యుద్ధం రాసిన ప్రేమకథ అంటూ... ఓ బలమైన క్యాప్షన్ పెట్టి - ముందే అందరినీ కట్టి పడేశాడు హను రాఘవపూడి. అప్పటి నుంచీ ఈ సినిమాపై అంచానాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్, పాటలూ.. ఒకదాని తరవాత మరోటి వదులుతూనే ఉన్నారు. ఇప్పుడు ట్రైలర్‌తో ఒక్కసారిగా అందరినీ కట్టిపడేశారు. రెండు నిమిషాల ట్రైలర్‌లోనే రెండు గంటల సినిమా చూపించాడు హను రాఘవపూడి. ఆ మేకింగ్, విజువల్స్, డైలాగులు... ఇవన్నీ `సీతారామం` సినిమాని థియేటర్లలో చూడాలన్న ఆసక్తిని పెంచేశాయి.
ఈ సినిమాకి ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకు అయ్యింది? ఏ ధైర్యంతో అంత పెట్టారు? అంటూ అంతా ఆశ్చర్యపోయారు. కానీ ట్రైలర్ చూస్తే.. ఇంత ఎందుకు ఖర్చు పెట్టారో అర్థమవుతోంది. చిన్న పాత్రకు సైతం పెద్ద స్టార్లు తీసుకురావడం, ఖరీదైన లొకేషన్లు, సెట్లూ... ఇవన్నీ `సీతారామం` బడ్జెట్ ని పెంచుకొంటూ వెళ్లాయి. ఈమధ్య సినిమాల్ని చూడ్డానికి జనాలు థియేటర్లకు రావడం లేదన్న ఓ కంప్లైంట్ గట్టిగా వినిపిస్తోంది. కానీ సీతారామం ట్రైలర్ చూస్తే... ఈ సినిమా చూడ్డానికి జనాలు థియేటర్లకు కుటుంబాలతో సహా వస్తారన్న నమ్మకం కలుగుతోంది. మరి... సీతారామం విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 5 వరకూ ఆగాల్సిందే.