చిన్న సినిమాల‌కు అన్యాయం జ‌ర‌గ‌బోతోందా?

మరిన్ని వార్తలు

ఏప్రిల్ 14 త‌ర‌వాత లాక్ డౌన్ ఎత్తేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కాస్త అటూ ఇటూ అయినా స‌రే, మే 1 నాటికి ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డొచ్చు. థియేట‌ర్ల ద‌గ్గ‌ర మ‌ళ్లీ కొత్త సినిమాల హంగామా మొద‌ల‌వ్వొచ్చు. మార్చి, ఏప్రిల్‌లో రావాల్సిన సినిమాల‌న్నీ ఇప్పుడు వ‌రుస క‌ట్ట‌బోతున్నాయి. అంతా ఓకే.. కానీ.. ఈ హ‌డావుడిలో చిన్న సినిమాల‌కు అన్యాయం జ‌రిగే ఛాన్సుంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సినిమాల విడుద‌ల ఇప్పుడు నిర్మాత చేతిలో లేదు. తాను కావాల‌నుకున్న స‌మ‌యంలో సినిమాని విడుద‌ల చేయ‌లేని పరిస్థితి. ఎందుకంటే సినిమాల విడుద‌ల ఇప్పుడు గిల్డ్ చేతిలో ఉంది. కొంత‌మంది నిర్మాత‌లు సిండికేట్‌గా ఏర్ప‌డి, సినిమా రిలీజ్ డేట్ల‌ని నిర్ణ‌యిస్తున్నారు.

 

సినిమాల‌న్నీ గుంపుగా రాకుండా, ప్ర‌తీ సినిమాకీ ఓ మంచి రిలీజ్ డేట్ దొర‌క‌డానికి ఇదో మంచి వేదిక‌. అయితే... ఇప్పుడు గిల్డ్ చేతిలో చిన్న సినిమాలు న‌లిగిపోతాయేమో అన్న భ‌యం క‌లుగుతోంది. ఇప్ప‌టికే చాలా వ‌రకు చిన్న సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ప‌రిస్థితుల‌న్నీ బాగుంటే, ఈపాటికి థియేట‌ర్లో సంద‌డి చేయాల్సింది. కానీ క‌రోనా.. పెద్ద స్పీడ్ బ్రేక‌ర్ లా అడ్డుప‌డింది. ఉదాహ‌ర‌ణ‌కు మార్చి 14 నుంచి విడుద‌ల కావ‌ల్సిన సినిమాల జాబితా పెద్ద‌దే ఉంది.

 

ఏప్రిల్ 2న కూడా రిలీజ్ అవ్వ‌డానికి రొన్ని సినిమాలు సిద్ధ‌మయ్యాయి. క‌రోనా వ‌ల్ల ఆ సినిమాల షెడ్యూల్ మారిపోయింది. ఇప్పుడు ముందుగా ఆయా సినిమాల విడుద‌ల‌కు అనుమ‌తి ఇస్తారా, లేదంటే... షెడ్యూల్ ప్ర‌కారం మే 1 నుంచి రావాల్సిన సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా అనేది పెద్ద ప్ర‌శ్న‌. అయితే గిల్డ్‌లో ఉన్న‌వాళ్లంతా పెద్ద నిర్మాత‌లే. వాళ్ల చేతుల్లోనూ కొన్ని సినిమాలున్నాయి. ముందు వాటికి లైన్ క్లియ‌ర్ చేశాకే, అప్పుడు మిగిలిన సినిమాల‌కు అనుమ‌తులు ఇస్తార‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.

 

పెద్ద నిర్మాత‌లు ఎలాగూ ఓ మంచి రిలీజ్ డేట్ సెట్ చేసుకోగ‌ల‌రు. చిన్న‌, మ‌ధ్య స్థాయి నిర్మాత‌ల‌కు మాత్రం దొరికిన తేదీనే సినిమాని విడుద‌ల చేసుకునే ప‌రిస్థితి. ఓకేసారి సినిమాల‌న్నీ ఢీ కొట్టుకుంటే. చిన్న సినిమాలు మాత్రం న‌లిగిపోవ‌డం ఖాయం. అందుకే చిన్న నిర్మాత‌ల్లో ఇప్పుడు గుబులు ప‌ట్టుకుంది. థియేట‌ర్లు మ‌ళ్లీ తెర‌చుకున్నా - త‌మ సినిమాల‌కు స్థానం దొరుకుతుందో లేదో అని ఆందోళ‌న చెందుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS