ఇది వరకు తెలుగు సినిమాలో నటిస్తారా.. అని అడిగితే.. బాలీవుడ్ భామలు మొహాలు తిప్పేసుకునే వారు. `తెలుగులో పాపులారిటీ తక్కువ` అన్నది వాళ్ల ఇన్నర్ ఫీలింగ్. అందుకే ఎంత ఇస్తామన్నా.. నో చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. పరిస్థితి మారింది. తెలుగు సినిమా అంటే, అందులోనూ స్టార్ హీరో సినిమా అంటే అది పాన్ ఇండియా రేంజే. అందుకే బాలీవుడ్ భామలు పనిగట్టుకుని మరీ టాలీవుడ్ లో లాండ్ అయిపోతున్నారు. పారితోషికం తక్కువ అన్నా సరే.. ఓకే అంటున్నారు. అందుకే ఇటీవల తెలుగులో బాలీవుడ్ భామల హవా ఎక్కువైంది. తాజాగా సోనాక్షి సిన్హాకి తెలుగులో ఓ ఛాన్స్ దొరికింది. అదీ.. చిరంజీవి పక్కన.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాని ఎంచుకోవాలనుకుంటోంది చిత్రబృందం. ఇటీవల సోనాక్షితో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే పారితోషికంగా ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. బాలీవుడ్ లో సోనాక్షి టైమ్ ఏం బాలేదు. అక్కడ నవతరం కథానాయికలతో పోటీ పడలేకపోతోంది. అవకాశాలు కూడా తగ్గాయి. అయినా సరే.. తెలుగులో భారీ పారితోషికం డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది వరకు రజనీకాంత్ `లింగ`లో నటించింది సోనాక్షి. అప్పుడూ అంతే. పారితోషికం విషయంలోనే పేచీలు పెట్టింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు కూడా అంతే. డబ్బుల విషయంలో గీచి గీచి బేరం ఆడుతోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో, ఏమిటో?