తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సోనాలి బింద్రే, క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం అమెరికాలో వైద్య చికిత్స పొందుతోంది సోనాలి బింద్రే. క్యాన్సర్ చికిత్స ఎంత బాధ కలిగిస్తున్నా, ఆ బాధను దిగమింగుకుని అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుంటోంది సోనాలి బింద్రే.
అమెరికాలో వుండడం వల్ల దీపావళి కాస్త ఆలస్యంగా వచ్చిందంటూ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్న సోనాలి ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో వుంచింది. ఆ ఫొటోలు చూశాక అభిమానులు మరింత భావోద్వేగానికి గురయ్యారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా, తీవ్రమైన నొప్పిని అనుభవిస్తోన్న సోనాలి.. ఈ క్రమంలో జుట్టుని పూర్తిగా కోల్పోయింది. 'ఇదొక వెరైటీ హెయిర్ స్టయిల్' అంటూ బాధని పైకి కన్పించనీయకుండా, ఇంట్రెస్టింగ్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సోనాలి బింద్రే.
తన కుమారుడు, తన భర్తతో కలిసి సోనాలి ప్రస్తుతం న్యూయార్క్‌లోనే వుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా వుంటోన్న సోనాలి, తరచూ తనను నొప్పి వేధిస్తుండడంతో హాస్పిటల్‌కి వెళితే, 'హై గ్రేడ్ క్యాన్సర్'గా గుర్తించారట. దాంతో షాక్‌కి గురయిన సోనాలి, సన్నిహితుల సూచనతో విదేశాలకు వెళ్ళింది. క్యాన్సర్ నుంచి తాను కోలుకుంటాననే ధీమా వ్యక్తం చేస్తోంది సోనాలి బింద్రే.
ఆమె క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోవాలని ఆశిద్దాం.