ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు.
దీనిపైన వెంటనే స్పందించిన సోనూసూద్..వారిని ముంబై రప్పించుకున్నారు. ముంబై లోని వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్ కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.