దైవం మానుష్య రూపేణా అంటారు. దేవుడంటూ.. ఎక్కడో ఉండడు. మనుషుల్లోనే ఉంటాడు. ఆపద సమయంలో ఆదుకునే ప్రతివాడూ దేవుడే. అలా కరోనా కష్టకాలంలో సోనూసూద్ కూడా దేవుడైపోయాడు. అడిగినవాళ్లకూ, అడగని వాళ్లకు సైతం.. సాయం చేస్తూ.. రియల్ హీరో అనిపించుకున్నాడు. సోనూసూద్ కి ఇప్పుడు బోలెడన్ని అభిమాన సంఘాలు. దేవుడి గుళ్లో.. సోనూసూద్ ఫొటో పెట్టి ఆరాధిస్తున్నవాళ్లూ ఉన్నారు. ఇప్పుడు సోనూ సూద్ విగ్రహం కూడా వెలసింది.
సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండాలో రాజేష్ రాథోడ్ అనే అభిమాని తన సొంత ఖర్చుతో విగ్రహం నిర్మించాడు. ఆదివారం స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ‘సోనూ సూద్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు సాయం చేశారు. ఆయన సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మేం సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటు చేసి మా అభిమానాన్ని చాటుకుంటున్నాం. దేవతల మాదిరిగానే ప్రతిరోజు సోనూ సూద్ విగ్రహానికి పూజలు చేస్తాం’ అని తెలిపారు.