వంద‌ పాటలు, గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

మరిన్ని వార్తలు

ఆయన ఒక్క పాట వంద పాటల పెట్టు.. అలాంటిది 100 సినిమాలు.. 100 పాటలు.. 100 మంది గాయనీగాయకులు ఒకే వేదికపై గళం విప్పితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఆ పాటలు ఇంకెవరో కాదు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినవి. సంతోషం - సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేదికపై ఈ అపురూప ఘట్టం దర్శనమివ్వనుంది. హైదరాబాద్ నోవాటెల్ లో నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గాన గంధర్వుడి నూరు గళాల స్వరార్చన ప్రారంభమవుతుంది.

 

సంతోషం - సుమన్ టీవీ ఈ స్వరార్చనను సమర్పిస్తున్నాయి. నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ కు నాంది పలకనున్నారు. బాలు పాటల్లో ఉన్న మెరుపు, మైమరపునకు కొలమానం లేదు. ఎందరో అతిరథ మహారథులైన హీరోల చిత్రాలకు బాలు పాటలు ప్రాణం పోశాయి. తెలుగు చిత్ర జగత్తుకు స్వరనీరాజనం అందించిన యుగం బాలూదే. పాటకు ఇంతటి వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత ఘంటసాల తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకే దక్కుతుంది.

 

త‌న జీవిత కాలంలో ఏకంగా 40 వేల పాటలు పాడారు బాలు. దేనికదే ఆణిముత్యం.. అటు మాస్.. ఇటు క్లాస్.. నవరసాలూ నివ్వెరపోయే పాటలు బాలు పాడారు. వాటినన్నిటినీ ఎలా మేళవించి ఈ స్వరార్చన చేస్తారో చూడాలి. ఆయన పాడిన చివరి పాట సూపర్ స్టార్ రజినీ ‘పెద్దన్న’ చిత్రం నుంచి జనం ముందుకు వచ్చింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం..లాంటి కోదండపాణి బాణీలూ, ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము, శంకరా నాదశరీరాపరా లాంటి కేవీ మహదేవన్ స్వరాలను ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. బాలు పాడిన 40 వేల పైచిలుకు పాటల్లోని ఆణిముత్యాలను ఏర్చి కూర్చి ఈ స్వరార్చనను నిర్వహించబోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS