బాలు.. జీవితం అద్భుతంగా సాగింది. ఆటు పోట్లు పెద్దగా లేవు. ఆయన మైకు పట్టుకున్న తరవాత.. ఖాళీగా గడిపిన రోజే లేదు. ప్రతీరోజూ పని దొరికింది. పాట పాటకీ ఒక్కో మెట్టూ ఎక్కి, ఉన్నత శిఖిరాలకు ఎదిగారు. గొప్ప జీవితం చూశారు. అత్యధిక పారితోషికం అందుకున్న గాయకుల్లో ఆయన మొదటి స్థానంలో ఉంటారు. చివరి రోజు వరకు కూడా. ఆయనకు దక్కని అవార్డు లేదు. ఎక్కని శిఖరం లేదు. అయినా.. ఆయనలోనూ కోరికలు ఉంటాయి. కదా. దేవుడు ప్రత్యక్షమైతే ఆయన ఏం కోరుకునేవారు? ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా.. చిన్నగా నవ్వేసేవారు బాలు.
''మరణం ఇవ్వొద్దని కోరుకుంటాను'' అన్నారు ఓసారి. ''నాకు జీవితం అంటే చాలా ఇష్టం. జీవించడం చాలా ఇష్టం. ఎక్కువ రోజులు ఈ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటాను..'' అన్నారు బాలు. ''ఒకవేళ మరణం వస్తే, నొప్పి తెలియకుండానే చనిపోవాలి. ఇంతకు మించి కోరుకునేది ఏమీ లేదు'' అనేవారుబాలు. పాపం.. ఇవి రెండూ తీరలేదనుకోవాలి. ఆసుపత్రి మంచంపై రోజుల పాటు పోరాడారు బాలు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయారు.