బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ గురించే ఇప్పుడంతా చర్చించుకుంటోంది. ఇంతవరకూ తెలుగులో విజువల్ ఎఫెక్ట్స్ మూవీ అంటే 'బాహుబలి'నే. అయితే 'బాహుబలి' మించిన స్థాయిలో ఇప్పుడు 'సాక్ష్యం' తెరకెక్కిస్తున్నారట.
మొదట్లో ఇదేదో మామూలు సినిమా అనుకున్నారంతా. కానీ విజువల్‌గా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది 'సాక్ష్యం' అని తెలుస్తోంది. 'బాహుబలి' కోసం పని చేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రం కోసం పని చేస్తున్నారట. విజువల్ ఎఫెక్ట్సే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇంతకు ముందెన్నడూ తెలుగు సినిమా స్క్రీన్‌పై చూడని విధంగా ఉండబోతున్నాయి. సరికొత్త థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయట. ప్రత్యేకంగా ఈ సినిమాలో ఓ పాట కోసం ఐదుగురు ప్రముఖ సింగర్స్ తమ గాత్రాన్ని వినియోగిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, హరిహరన్, కైలాష్ ఖేర్, బాంబే జయశ్రీలు ఈ పాటను ఆలపిస్తున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్ కానుందట.
బెల్లంకొండకు జంటగా ఈ చిత్రంలో హాట్‌బ్యూటీ పూజా హెగ్దే నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచింది. ఇక ట్రైలర్‌ని మరింత ప్రత్యేకంగా కట్ చేయబోతున్నారట. పునర్జన్మలు, పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం బెల్లంకొండ కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుందట. ఇంతవరకూ మాస్ అండ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండకు 'సాక్ష్యం' సంచలన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలిక.