ఒక్క సినిమాతోనే స్టార్లయిపోవడం అంటే మాటలు కాదు. పెళ్లి సందడితో... అలా ఆ అదృష్టాన్ని తన సొంతం చేసుకొంది శ్రీలీల. పెళ్లి సందడి గొప్ప సినిమా ఏం కాదు. కేవలం రాఘవేంద్రరావు మాయాజాలం, శ్రీలీలని ఆయన చూపించిన విధానంతో.. కిక్ వచ్చింది. శ్రీలీల కోసం, ఆమె డాన్సుల కోసం ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూశారు జనాలు. ఈ క్రేజ్‌తోనే శ్రీలీల వరుసగా ఆఫర్లు అందుకొంది. పెళ్లి సందడి తరవాత శ్రీలీల చాలా సినిమాలే చేసింది. కానీ.. ఒక్కటీ బయటకు రాలేదు. `ధమాకా` ఆమె రెండో సినిమా. ఈ శుక్రవారం ధమాకా వస్తోంది. ఈ సినిమాలో కూడా శ్రీలీల డాన్సులు ఇరగదీసిందని టాక్. రేప్పొద్దుట సినిమా పడేంత వరకూ శ్రీలీల ఏం చేసిందో తెలీదు.
శ్రీలీలది.. అదృష్టమా? లేక నిజంగానే తను ప్రతిభావంతురాలా? అనేది ధమాకాతో తేలిపోతుంది. ధమాకా కమర్షియల్ సినిమా. ఇలాంటి కథల్లో హీరోయిన్లకు పెద్దగా స్కోప్ ఉండదు. పైగా రవితేజది డ్యూయల్ రోల్. అలాంటప్పుడు హీరోయిన్ల పాత్రలు మరీ తేలిపోతాయి. అయినా కూడా శ్రీలీల పేరు తెచ్చుకొంటే, తనకున్న తక్కువ స్క్రీన్ టైమ్‌లో... తనదైన ముద్ర వేస్తే.. శ్రీలీలలో నిజంగానే స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నట్టే. ధమాకా కాస్త అటూ ఇటూ అయినా ఫర్వాలేదు. తన చేతిలో చాలా సినిమాలున్నాయి. ధమాకా కనుక హిట్టయితే.. తన రేంజ్ పూర్తిగా మారిపోతుంది. ఇకపై అగ్ర హీరోలు కూడా శ్రీలీల పేరు కలవరించడం ఖాయం.