బుల్లితెర నటుడిగా మంచి పేరుంది హర్షవర్ధన్‌కి. 'అమృతం' సీరియల్ ద్వారా బుల్లితెరపై పాపులారిటీ తెచ్చుకున్న నటుడు హర్షవర్ధన్. కేవలం నటుడు మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ ఈయన. బుల్లితెర నుండి పెద్ద తెరకు ప్రమోట్ అయ్యాడు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఇప్పుడు డైరెక్టర్‌గా కొత్త అవతారమెత్తాడు. డైరెక్టర్ కావాలన్న కోరిక హర్షవర్ధన్‌కి ఇప్పటిది కాదట.
అయితే ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరుతోందంటున్నాడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ద్వారా. ఈ సినిమా టైటిల్‌ని ముద్దుగా 'గుగ్లీ' అని పిలుచుకుంటున్నారట. ఇదో విలేజ్ డ్రామా. 80వ దశకం నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించారట. టీవీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మురళీ కృష్ణ, కిషోర్ ఇతర ముఖ్య తారాగణంగా కనిపించనున్నారు. అయితే ముగ్గురున్నారు..కదా టైటిల్‌ని బట్టి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అంటే అవి ఈ ముగ్గురి క్యారెక్టర్స్‌కి సంబంధించిన స్వభావాలు అనుకునేరు. అస్సలే కాదు అంటున్నాడు డైరెక్టర్ హర్షవర్ధన్.
ప్రతీ మనిషిలోనూ ఈ స్వభావాలుంటాయట. అయితే అవి ఎప్పుడు బయటికి వస్తాయో ఆ వ్యక్తికే తెలీదనీ చెబుతున్నాడు. ఆ విషయాన్నే ఈ సినిమాలో సరికొత్త కథనం ద్వారా చూపించే ప్రయత్నం చేశారట. ఆయన దర్శకత్వం వహిస్తూనే ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు ఈ సినిమాలో. అంతేకాదు మ్యూజిక్ కూడా ఆయనదే. రచయితగా 'మనం', ఇష్క్' తదితర చిత్రాలకు పని చేసిన హర్షవర్ధన్ 'గుగ్లీ' సినిమా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఈ నెల్లోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.