అచ్చమైన తెలుగమ్మాయిలకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు చాలా అరుదు. ఎందుకంటే, తెలుగమ్మాయిలు గ్లామర్‌కి కాస్త దూరంగా ఉంటారనే అపోహ ఉందింతవరకూ. అయితే మెల్లమెల్లగా ఆ అపోహ వీడుతోంది. తెలుగందాలు కూడా సినిమాకి తగినంత గ్లామర్‌ని ఒలకబోయగలవని సంకేతాలు పంపిస్తున్నారు మన తెలుగమ్మాయిలు. అంజలి, శ్రీదివ్య, బిందుమాధవి, కలర్స్ స్వాతి ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో హీరోయిన్స్‌గా వెలిగిపోవాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు.
కానీ విచిత్రమేమంటే, వీరంతా తెలుగులో కన్నా, తమిళంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. అయితే పరభాషలో ఎంతటి ఘన కీర్తి పొందినా, ఈ ముద్దుగుమ్మలకి సంతృప్తి కలగడం లేదట. మాతృభాషలో సత్తా చాటాలన్నదే వీరి కోరిక. అందుకే తమకున్న కొన్ని హద్దుల్ని చెరిపేయాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే, మన దర్శక నిర్మాతలకు కొన్ని సంకేతాలు పంపిస్తున్నారు. మొన్నామధ్య స్లిమ్‌గా తయారై గ్లామరస్‌గా ఫోటోలకు పోజిస్తూ అంజలి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అంజలిని అలా చూసిన వారు షాక్ అయ్యారు. తాజాగా ఇప్పుడు ఈ లిస్టులో మరో తెలుగు భామ శ్రీ దివ్య కూడా చేరింది. ఈమె కూడా ఇకపై తెలుగులో వరుస సినిమాలు చేస్తానంటోంది. 'మనసారా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన టాలెంట్‌తో, క్యూట్ అప్పీల్‌తో ఆకట్టుకుంది. కానీ గ్లామర్‌కి నో అనేసరికి అవకాశాలు కూడా నో అంటూ దూరమయ్యాయి ఈ ముద్దుగుమ్మకి.
అయినా కానీ ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోయినే. అయితే తెలుగులో సత్తా చాటాలన్నదే ఈమె టార్గెట్ కూడానట. అందుకే తనలోని హాట్ యాంగిల్‌ని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేయాలని నిర్ణయించుకుందట శ్రీదివ్య. అంటే గ్లామర్‌కి పచ్చ జెండా ఊపేసిందని అర్ధం.