ఇండియన్ స్టైల్ మూవీ.. హాంగ్‌కాంగ్‌లో ఏంటి.? అంటే, అదే మరి ఈ సినిమా ప్రత్యేకత. హాంగ్‌కాంగ్‌లో స్థిరపడ్డ శ్రీ కిషోర్, కొరియోగ్రాఫర్. బాలీవుడ్ స్టైల్ డాన్స్‌ని హాంగ్‌కాంగ్‌లో ఇండియన్స్‌తోపాటు, వివిధ దేశాలకు చెందినవారికి నేర్పించడంలో శ్రీ కిషోర్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు ఈ శ్రీ కిషోర్, ‘మై ఇండియన్ బాయ్‌ఫ్రెండ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. కాంటోనీస్ అలాగే హిందీ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తుండడం గమనార్హం.
ఈ రెండు భాషలతోపాటు, తెలుగు అలాగే తమిళ భాషల్లోనూ సినిమాని డబ్ చేయనుండడం గమనార్హం. ఇప్పుడు అంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తుండడంతో ఈ ‘మై ఇండియన్ బాయ్‌ఫ్రెండ్’ని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. హాంగ్‌కాంగ్‌కి చెందిన యువతి, భారతీయ యువకుడి ప్రేమలో పడటం, ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ఈ సినిమాలో ప్రధాన కథాంశమని చిత్ర దర్శకుడు శ్రీ కిషోర్ చెబుతున్నారు.
శ్రావణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కరణ్ చోలియా, షెర్లీ చాన్, జస్టిన్, లెన్నా, కాకి తదితరులు ప్రధాన తారాగణం. మిల్క్ చాకొలేట్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ కిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.