'లెట్ హెర్ రెస్ట్ ఇన్ పీస్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో సెలబ్రిటీస్ అందరూ రిక్వెస్ట్‌లాంటి యుధ్దం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో. అల్లు అర్జున్, రానా, కాజల్, తాప్సీ, సుమంత్, సందీప్ కిషన్, సీరత్ కపూర్, మెహరీన్‌తో పాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ హ్యాష్ ట్యాగ్‌తో వార్ స్టార్ట్ చేశారు.
మీడియాలో శ్రీదేవి మరణంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అవన్నీ శ్రీదేవి అభిమానుల్ని బాగా కలచి వేస్తోంది. ఆమెని ఈ రకంగా అవమానించొద్దు అంటూ సోషల్ మీడియాలో ఇతరత్రా కథనాలు వెల్లువెత్తుతున్నా, మీడియా అత్యుత్సాహం మాత్రం ఆగడం లేదు. దాంతో ఆమె అభిమానులైన సినీ ప్రముఖులే ఈ రకమైన ఆలోచన చేశారు. మరో పక్క దుబాయ్‌లో పోలీసుల ఆధీనంలో ఉన్న శ్రీదేవి మృతదేహం ఇండియాకి చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందంటూ తాజా సమాచారమ్ అందుతోంది. అందులో భాగంగా శ్రీదేవి మృతదేహానికి ఎంబాల్మింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే ఆమె భౌతిక కాయాన్ని ఇండియాకి తరలించే ఏర్పాట్లు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ విమానం ఎక్కే వరకూ ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు రాత్రి అనగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే శ్రీదేవి మృతదేహం ముంబయ్‌కి వచ్చే అవకాశాలున్నాయి. శ్రీదేవి మరణం వెనుక తలెత్తిన అనుమానాల దృష్ట్యా ఆమె భౌతికాకాయం ఇండియాకి తరలించే ప్రక్రియలో ఆలస్యం మీద ఆలస్యం అవుతూ వస్తోంది.
తాజాగా అందిన ఈ సమాచారమ్‌లో భాగంగా ఈ కేసు ఒక అడుగు ముందుకు నడిచినట్లుగా భావించాలి. మరోపక్క ముంబయ్‌లో ఆమె స్వగృహం వద్ద శ్రీదేవిని ఆఖరి చూపు చూసేందుకు అభిమానులు, కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో అశ్రు నయనాలతో ఎదురు చూస్తున్నారు.