అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అందంగా కొలువుతీరింది. ఆమెను అలా చూస్తుంటే, నిజంగానే అతిలోక సుందరి అల స్వర్గాన్ని విడిచి, ఇల భూమిపై ప్రత్యక్షమైందా? అన్నట్లుగా ఉంది. గోల్డెన్ కలర్ దుస్తుల్లో ఈ మైనపు బొమ్మను రూపొందించారు. జ్యూయలరీ, తలపై బంగారు కిరీటం, ఆ ఠీవి.. ఇలా అసలు సిసలు అతిలోక సుందరినే ప్రతిబింబిస్తున్నాయి.
శ్రీదేవి కుటుంబ సభ్యులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణానంతరం, శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు శ్రీదేవి మైనపు విగ్రహంతో కలిసి అందంగా ఫోటోలకు పోజిచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి మైనపు విగ్రహాన్ని చూసి, బోనీకపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. కూతురు జాన్వీని హీరోయిన్‌గా చూసుకోవాలన్న తన కోరిక నెరవేరకుండానే ఆమె అనంత లోకాలకు వెళ్లిపోయింది. తల్లి నుండి నట వారసత్వం అంది పుచ్చుకున్న జాన్వీ 'ధడక్' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
నటనలో తొలి సినిమాకే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. త్వరలోనే 'గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గాళ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది జాన్వీ కపూర్. రేపో మాపో సౌత్‌లోనూ జాన్వీ తెరంగేట్రానికి తెర వెనక సన్నాహాలు జరుగుతున్నాయి.