మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'కోతల రాయుడు' అప్పట్లో ఘన విజయం సాధించింది. మాధవి చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన సినిమా అది. చాలా కాలం తర్వాత అదే టైటిల్‌తో శ్రీకాంత్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. సుధీర్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
వెంకటరమణ మూవీస్ పతాకంపై కొలన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన 'జై సింహా'లో హీరోయిన్‌గా నటించిన నటాసా దోషి ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. డింపుల్ చోపాడియా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ గతంలో యంగ్ హీరో ప్రిన్స్, కమెడియన్ కమ్ హీరో సునీల్ సరసన నటించింది.
ఇకపోతే శ్రీకాంత్, మెగాస్టార్‌కి అత్యంత సన్నిహితుడు. 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రంలో 'ఏటీఎమ్' పాత్రలో చిరంజీవికి సపోర్టింగ్ రోల్‌లో నటించి మెప్పించాడు. అలాగే విలన్‌గా తెరంగేట్రం చేసి, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. హ్యాండ్‌సమ్ అండ్ ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయ్యాడు.
అయితే ప్రస్తుతం హీరోగా కన్నా, సపోర్టింగ్ రోల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అల్లు అర్జున్‌తో 'సరైనోడు' చిత్రంలో నటించాడు. బన్నీకి బాబాయ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో. అలాగే చైతూతో 'యుద్ధం శరణం'లో నెగిటివ్ పాత్రలోనూ నటించాడు. మళ్లీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 'కోతల రాయుడు'తో శ్రీకాంత్ ఎలా మెప్పిస్తాడో చూడాలిక.