'దండుపాళ్యం' సినిమా ఓ సంచలనం. ఆ సినిమా కథాంశమే ఓ అద్భుతం. మంచి విజయాన్ని అందుకున్న ఆ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీనివాస్ రాజు మరో సంచలనానికి తెరలేపుతున్నారు. కంచి పీఠానికి సంబంధించి 2004లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల వెనుక అసలు కోణం ఏమిటో 'ఆచార్య అరెస్ట్' సినిమా చూస్తే తెలుస్తుందట. కంచి పీఠంలో శంకర రామన్ అనే టెంపుల్ మేనేజర్ మృతి అప్పట్లో ఓ మిస్టరీ. ఆ మిస్టరీని ఇప్పటిదాకా ఛేదించలేకపోయారు. హిందూ ధార్మిక సంస్థగా కంచి పీఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఆ హత్య మిస్టరీని కథాంశంగా రూపొందించాలనే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా వివాదాస్పదమవుతుంది. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని త్వరలోనే కలిసి అన్ని విషయాలనూ కులంకుషంగా చర్చిస్తానని శ్రీనివాస్ రాజు అంటున్నారు. 'ఇన్‌సల్ట్ టు ఎవ్విరి హిందు' అనే ట్యాగ్‌లైన్‌తో 'ఆచార్య అరెస్ట్' సినిమా రూపొందించనున్నట్లు శ్రీనివాస్ రాజు ప్రకటించగానే సినీ వర్గాల్లోనూ, ధార్మిక వర్గాల్లోనూ ఈ సినిమా అప్పుడే సంచలనంగా మారిపోయింది.