కరోనా - లాక్ డౌన్.. వీటి వల్ల ప్రపంచం మొత్తం అట్టుడికిపోతోంది. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. చిత్రసీమ కూడా దీనికి అతీతం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. వేసవికి, దసరాకీ, ఆపై వచ్చే సంక్రాంతికి రావాల్సిన సినిమాలపై కూడా కరోనా ఎఫెక్ట్ ఉండబోతోంది. అన్ని సినిమాలూ ఒక ఎత్తు. ఆర్.ఆర్.ఆర్ మరో ఎత్తు. బాహుబలి తరవాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా. పైగా మల్టీస్టారర్. రెండు అగ్ర కుటంబాలకు చెందిన స్టార్ హీరోలు ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అందుకే.. ఈ సినిమాకి అంత క్రేజు. 2021 జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని రాజమౌళి ఎప్పుడో ప్రకటించేశారు.
కానీ ఇప్పుడు అందరిలోనూ బోలెడు డౌట్లు. లాక్ డౌన్ వల్ల సినిమాలన్నీ వాయిదాలు పడుతున్నాయి కదా, మరి.. రాజమౌళి సినిమా కూడా అంతేనా? అని లెక్కలేసుకుంటున్నారు. వాళ్లందరికీ గుడ్ న్యూస్ ఏమిటంటే... ఈ సినిమా మరోసారి వాయిదా పడబోవడం లేదు. అనుకున్న సమయానికే ఈ సినిమా వచ్చేస్తుంది. ముందు చెప్పినట్టే జనవరి 8న ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్ర నిర్మాత దానయ్య చెబుతున్నారు. సినిమాల షూటింగులు ఆగిపోయినా సరే, చెప్పిన సమయానికి ఈ సినిమాని విడుదల చేయబోతున్నారంటే.. రాజమౌళి ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు. కానీ.. ఇక్కడా కొన్ని షరతులు ఉన్నాయి. మే 1కల్లా పరిస్థితులన్నీ మామూలైపోవాలి. ఇదే లాక్ డౌన్ మే నెలాఖరు వరకూ గనుక కొనసాగితే మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరు.