రాజమౌళి సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏళ్ళ తరబడి ఆ సినిమాలు నిర్మాణం జరుగుతుంది. కానీ, ఏళ్ళు గడిచినా ఆయన సినిమాల్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. అంత గొప్ప సినిమాల్ని తీసిన దర్శకుడు రాజమౌళి, ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు.. ఆ మాటకొస్తే, భారతీయ సినిమా స్థాయిని పెంచాడు ఈ జక్కన్న. అందుకే, రామాయణం.. మహాభారతం.. లాంటి గాధల్ని ఈ తరంలో రాజమౌళి తప్ప ఇంకెవరూ తెరకెక్కించలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మహాభారతం, రామాయణం వంటి గాధలకు సంబంధించి ఒకప్పటి టెలివిజన్ సీరియల్స్ ఇప్పుడు కొత్తగా ప్రసారమవుతున్న విషయం విదితమే. వాటిని చూస్తున్నవారంతా, ఇప్పుడు గనుక రామాయణం, మహాభారతం వంటి సినిమాలు తీయాల్సి వస్తే, రాజమౌళి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదని అంటున్నారు.
‘రాజమౌళి సర్.. మీరు రామాయణం తీయండి.. రాజమౌళి సర్.. మీ నుంచి మహాభారతం ఆశించవచ్చా..‘ అని అభిమానులు, సోషల్ మీడియా ద్వారా విజ్నప్తి చేస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనల పట్ల ఇంతవరకు రాజమౌళి పెదవి విప్పలేదు. కానీ, మహాభారతం, రామాయణం వంటి గాధల్ని సినిమాలుగా తెరకెక్కించాలనే ఆలోచన మాత్రం రాజమౌళికి వుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నటీనటలు ఎంపిక సహా అనేక సవాళ్ళున్నాయి.. రామాయణం తెరకెక్కించడానికైనా, మహాభారతం తెరకెక్కించడానికైనా. ఒక్క పార్ట్ సరిపోదు.. నాలుగైదు పార్టులుగా వీటిని తీయాల్సి వస్తుందేమో.