ఇప్పుడంతా `ఆర్.ఆర్.ఆర్` హవానే. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే జనం మాట్లాడుకుంటున్నారు. రూ.500 కోట్ల మైలు రాయిని మూడు రోజుల్లోనే అందుకున్న చిత్రంగా `ఆర్.ఆర్.ఆర్` రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సామాన్యమైన రికార్డ్ కాదిది. ఇప్పుడు ఈ పరుగు ఎక్కడ ఆగుతుంది? ఫైనల్ రన్ వరకూ ఎంత వసూలు చేస్తుంది? అనే లెక్కలేసుకుంటున్నారంతా. ఈ సినిమాకి దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. నిజానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..? రూ.250 కోట్లు. అయితే మధ్యలో సమీకరణాలు మారాయి. కరోనా వచ్చింది. వడ్డీలు పెరిగాయి. ఇలా.. బడ్జెట్ అవధులు దాటుకొంటూ వెళ్లింది.
ఈ సినిమా మొదలైనప్పుడే.. రూ.400 కోట్లకు బేరం వచ్చేసిందట. ఈ సినిమా సెట్స్‌కి తీసుకెళ్లకముందే.. టోకున కొనేయడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. రూ.250 కోట్ల బడ్జెట్.. అంటే..ఈ సినిమా అమ్ముకొంటే రూ.150 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. నిజంగానే అద్భుతమైన ఆఫర్ ఇది. కానీ రాజమౌళి ఈ ఆఫర్‌ని తిరస్కరించాడట. ``బడ్జెట్ రూ.250 కోట్లు అనుకుంటాం కానీ.. అది ఎంత వరకూ వెళ్లి ఆగుతుందో చెప్పలేం.. బడ్జెట్ పెరిగితే మొత్తం మునిగిపోతాం`` అని చెప్పారట. ఇప్పుడు అదే నిజమైంది. బడ్జెట్ పెరుగుతూ పోయిది. అప్పుడు రూ.150 కోట్ల కోసం ఆశ పడితే.. సినిమాని 400 కోట్లకు అమ్మేస్తే.. ఇప్పుడొస్తున్న లాభాలు కాదు కదా.. రాజమౌళి టీమ్ భారీ నష్టాలు చవి చూడాల్సివచ్చేది. ఈ విషయంలో.. మంచి నిర్ణయమే తీసుకొన్నాడు జక్కన్న.