రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆఫీసర్'. నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో దాదాపు 28 ఏళ్ల తర్వాత తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 25న రావాల్సిన ఈ చిత్రం జూన్ 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా స్టోరీ గురించి చెబుతూ వర్మ అభిమానులతో కొన్ని విషయాలు పంచుకున్నారు.
యదార్ధ గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది అని వర్మ చెబుతున్నారు. కర్ణాటక పోలీసాఫీసర్ కె.ఎమ్ ప్రసన్న జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని వర్మ చెబుతున్నారు. అయితే ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకుని మాత్రమే ఈ చిత్రం రూపొందింది. అంతేకానీ, ఆయన బయోపిక్ అయితే కాదట. ఇదంతా బాగానే ఉంది.
కానీ ఈ స్టోరీ కాపీ చేశారంటూ అసిస్టెంట్ డైరెక్టర్ జయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. గతంలో వర్మ 'జీఎస్‌టీ' కాన్సెప్ట్ కూడా అలాగే కాపీ కొట్టారనీ ఆరోపిస్తూ ఆయన మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు 'ఆఫీసర్' స్టోరీ కూడా తనదేనంటూ మీడియా ముందుకొచ్చారు. దాంతో ఈ సినిమాకి మరో వివాదం తోడైంది.
ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థకు వర్మ బాకీ ఉన్నాడంటూ, ఆ బాకీ తీర్చేదాకా సినిమా విడుదల కానివ్వమంటూ సదరు నిర్మాణ సంస్థ కోర్టుకెక్కగా, తాజాగా జయ్ కుమార్ వివాదం ఒకటి 'ఆఫీసర్'కి తలనొప్పిగా మారింది. ఈ తలనొప్పుల బారి నుండి వర్మ - నాగ్ 'ఆఫీసర్' ఎలా బయట పడుతుందో. జూన్ 1కి అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలిక.