మొన్నటి వరకూ టాలీవుడ్ కి కరోనా కష్టాలు. ఆ తరవాత.. టికెట్ రేట్ల గొడవ. ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ల గురించి పెద్ద రచ్చే జరుగుతోంది. ఇవి చాలవన్నట్టు టాలీవుడ్ పై మరో పిడుగు పడింది. కార్మికులు సమ్మెకు దిగడంతో.. ఈ రోజు నుంచి షూటింగులన్నీ బంద్ అయ్యాయి. ఎక్కడ షూటింగులు అక్కడే ఆగిపోయాయి. ఇది నిర్మాతలకు, చిత్రసీమకు గట్టి దెబ్బే.
వేతనాల విషయంలో 24 విభాగాలకు చెందిన కార్మికులు ఎప్పటి నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దైనందిన జీవితంలో ఖర్చులన్నీ పెరుగుతున్నాయని, తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఈ విషయంలో నిర్మాతలను ఒప్పించాలని చూసింది. అయితే నిర్మాతల మండలి స్పందించలేదు. దాంతో ఇప్పుడు కార్మికులు సమ్మెకు దిగారు. వేతనాలు పెంచేంత వరకూ షూటింగులకు రామని.. తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. ఈరోజు చిత్రీకరణలకు అంతరాయం కలిగిస్తూ సమ్మెకు దిగారు. దాంతో షూటింగులన్నీ ఆగిపోయాయి. విషయం తెలిసి నిర్మాతలు రంగంలోకి దిగారు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో, ఫెడరేషన్ సభ్యులతో నిర్మాతలు చర్చలకు సిద్ధమయ్యారు. సాయింత్రం లోగా చర్చలు ఓ కొలిక్కి వస్తే సరేసరి. లేదంటే... ఈ సమ్మె నిరవధికంగా కొనసాగే ప్రమాదం ఉంది. ఓ రోజు షూటింగ్ ఆగిపోతే నిర్మాతలకు ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించాలని నిర్మాతలు భావిస్తున్నారు.