స్టార్ మా లో ప్రసారం కాబోతున్న తెలుగు టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా యాంకర్ శ్వేతా రెడ్డి మరియు నటి గాయత్రి గుప్తా.. స్టార్ మా యాజమాన్యం మరియు బిగ్ బాస్ నిర్వాహకులు తమని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ కూడా ఇచ్చారు. నిన్న, ప్రముఖ నిర్మాత 'కేతి రెడ్డి జగదీశ్వర రెడ్డి' కూడా ఈ షో ని ఆపివేయాలంటూ కోర్టు లో ప్రజా ప్రయోజన వాజ్జం దాఖలు చేశారు.
ఇప్పుడు వీరికి తోడుగా ఓ.యు విద్యార్థులు కూడా ఈ షో ని ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. షో పేరుతో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వంటి తప్పుడు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. బిగ్ బాస్ షో ఆపని పక్షంలో హోస్టు గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున మరియు బిగ్ బాస్ నిర్వాహకుల ఇళ్ళని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ఇలాంటి వివాదాల మధ్య ఇంకో నాలుగు రోజుల్లో మొదలవ్వాల్సిన ఈ షో పరిస్థితి ఏంటో, బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.