మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా షూటింగ్‌లో జాయిన్ అయిన కన్నడ నటుడు సుదీప్, సైరా తాజా విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి అంటే తనకెంతో ఇష్టమనీ, ఆయనతో నటించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఆయనతో కలిసి నటిస్తున్న ప్రతీక్షణం సెట్‌లో షాకింగ్‌కి గురవుతున్న సందర్భాలే చాలా ఎక్కువున్నాయట సుదీప్‌కి. షాకింగ్ ఎందుకంటే, మెగాస్టార్ ఎనర్జీ. ఆ వయసులో ఆయన ఎనర్జీకి షాకవడమే సుదీప్ వంతవుతోందట. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అపురూపమైన అవకాశం తనకి వచ్చినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందంటున్నాడు సుదీప్.
ఇదే విషయం ఈ సినిమాలో నటిస్తున్న ప్రతీ పాత్రధారి చెబుతున్నారు. అంటే మెగాస్టార్ ఏ రేంజ్‌లో ఎనర్జీ కనబరుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనిపిస్తోంది. అయితే ప్రత్యక్షంగా చెప్పుకోవాలంటే సినిమా చూసేంత వరకూ వేచి చూడాల్సిందే. ఇకపోతే కన్నడలో ప్రముఖ హీరో అయిన సుదీప్ తెలుగులో నటించిన 'ఈగ' సినిమా మంచి విజయం అందుకుంది. విలన్ పాత్ర అయినా ఆ పాత్రలో సుదీప్ చూపించిన వేరియేషన్స్‌కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
'ఈగ' తర్వాత 'బాహుబలి ది బిగినింగ్'లో ఓ గెస్ట్ రోల్ పోషించాడు. తర్వాత ఇప్పుడు 'సైరా'లో ఇంపార్టెంట్ రోల్‌లో సుదీప్ కనిపించనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.