శ్రీరాముడి పై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల అంశం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా ఆ తరువాత అది ఇప్పుడు ఒక పెను తుఫానులా మారిపోయింది.
కత్తి మహేష్ వ్యాఖ్యలని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పైన పలువురు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు అవ్వడం ఆయనని విచారించడం కూడా జరిగింది. ఇక తాజాగా మహేష్ చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఆయన పైన చర్యలు, అలాగే నగరం నుండి బహిష్కరించాలని కోరుతూ ఈరోజు బోడుప్పల్ నుండి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర చేయాలని పరిపూర్ణానంద స్వామి నిశ్చయించారు.
ఇక ఈ యాత్ర జరిగితే కచ్చితంగా శాంతిభద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆయనని గృహనిర్భంధంలో ఉంచారు. ఈ పూర్తి అంశానికి సంబంధించి కారకుడు అని భావిస్తున్న మహేష్ కత్తిని హైదరాబాద్ నగరం నుండి బహిష్కరిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుని ఆ లేఖని స్వయంగా మహేష్ కి అందచేసి నగరం బయట విడిచిపెట్టారట. తదుపరి ఆదేశాలు వెలువడేవరకు మహేష్ కత్తి హైదరాబాద్ కి వచ్చే అనుమతి ఉండదు అని స్పష్టంచేశారు.
దీనితో చిన్న అంశంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు మరింతగా ముదిరి ఒక వివాదాంశంగా మారిపోయింది.