ఓ సినిమా ఒప్పుకున్నాక, అంతకన్నా పెద్ద ఆఫర్ వస్తే.. ఎంచక్కా చిన్న సినిమాని వదిలేసి, పెద్ద సినిమా వైపు మొగ్గు చూపుతుంటారు చాలామంది. కానీ, చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఆలోచించకుండా, కమిట్‌మెంట్ మేరకు డెడికేటెడ్‌గా వర్క్ చేయడం చాలా అరుదుగా కన్పిస్తుంటుంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో వెర్సటైల్ యాక్టర్ సుధీర్‌బాబు కూడా ఒకడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో సుధీర్‌బాబు నటిస్తోన్న విషయం విదితమే. ఈ సినిమా సమయంలోనే బాలీవుడ్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయట. అయితే, పుల్లెల గోపీచంద్ సినిమా కోసం కాస్త సన్నబడాల్సి వుండడంతో, బాలీవుడ్ ఛాన్సులు వదిలేసుకున్నాడట.
బాలీవుడ్ సినిమాల్లో ఇంకాస్త వెయిట్ పెరిగి నటించాల్సి వుందనీ, దాంతో ఆ అవకాశాలు వద్దనుకున్నాననీ, ఈలోగా పుల్లెల గోపీచంద్ సినిమా ఆలస్యమవుతూ వచ్చిందనీ, అయినాగానీ తన మనసుకు నచ్చిన సినిమా కావడంతో ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడలేదని సుధీర్‌బాబు చెప్పుకొచ్చాడు. ‘వి’ సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ, తొలుత ఈ సినిమా గురించి దర్శకుడు తన వద్ద చెప్పినప్పుడే తాను ఈ సినిమాలో చేయాలనుకున్నాననీ, అయితే దర్శకుడి మనసులో వేరే ఆలోచనలున్నాయనీ, చివరికి ఆ సినిమా తన దగ్గరకే వచ్చిందనీ, తన సంకల్ప బలం అంత గొప్పదని తాను నమ్ముతున్నానని సుధీర్‌బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, రేపు.. అంటే ఉగాదికి ‘వి’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేది. కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్త లాక్‌డౌన్ అవడంతో, ‘వి’ విదుదల వాయిదా పడింది.