ప్రస్తుతం ఎక్కడ చూసినా RX100 గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా వచ్చి అంచనాలను తలక్రిందులు చేస్తూ పెద్ద విజయం సాధించింది. అయితే ఈ కథ ను ముందుగా దర్శకుడు అజయ్ భూపతి, హీరో సుధీర్ బాబు దగ్గరికి తీసుకెళ్లి వినిపించాడట. ఈ కథ పై సుధీర్ బాబు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, కొత్త హీరో కార్తికేయ దగ్గరికి వచ్చిందని సమాచారం.
సుధీర్ ఈ సినిమా చేసి ఉంటే 'సమ్మోహనం' తర్వాత మరో హిట్ ఈయన ఖాతాలో పడేది. ఏదేమైనా సుధీర్ బాబు మరో మంచి హిట్ కోల్పోయాడని అందరూ భావిస్తున్నారు. వర్మ శిష్యుడు అజయ్ దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్లగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
రెండున్నర కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే లాభాల బాట పట్టింది. దీనికి ప్రధాన కారణం గతవారం విడుదలైన విజేత, చినబాబు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవటం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం వివిధ చానళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.