ఆకాశాన్నంటే అంచనాలతో, కనీ వినీ ఎరుగని విజువల్స్‌తో, భారీ బడ్జెట్‌తో, కోటి ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సాహో' ఊహించని విధంగా రిజల్ట్ నమోదు చేసింది. అయితే, ఈ సినిమాని ఇంతలా దిగజార్చేసిందెవరు? కారణం రివ్యూలేనా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. 'సాహో' డైరెక్టర్ సుజిత్ నుండి కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఇదే మాట వినిపిస్తోంది. 'దారుణంగా నెగిటివ్ రివ్యూలిచ్చేశారు. మరీ ఘోరంగా రన్నింగ్ కామెంట్రీ చేసేశారు.
నేను తీసింది 'బాహుబలి 3' కాదు. 'సాహో'.. అని వారికి గట్టిగా చెప్పాలనిపించింది కానీ, ఈ లోగానే అంచనాలు చప్పబడిపోయాయి..' అని సుజిత్ అభిప్రాయపడ్డాడు. 'బాహుబలి' అంచనాలతో వచ్చి సినిమాని చూడడం వల్ల, 'సాహో' వారి అంచనాల్ని అందుకోలేకపోయి ఉండొచ్చు. కానీ, ఓ యాక్షన్ డ్రామా చూసేందుకు వచ్చామని మనసులో అనుకుని సినిమా చూసి ఉంటే, 'సాహో' ఖచ్చితంగా విజయం సాధించేది అని సుజిత్ అన్నాడు. షార్ట్ ఫిలింస్ నుండి వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని టేకప్ చేసిన నా జర్నీ, ఎంతో మందికి ఆదర్శం కావాలి. కానీ, ఆ ఆదర్శాన్ని ఆదిలోనే తుంచేసినట్లయ్యింది. ఇందుకు కారణం రివ్యూలే అని ఆయన చెప్పుకొచ్చారు.
హిందీలో 'సాహో'కి దక్కిన కనీసపాటి ఆదరణ కూడా తెలుగు ప్రేక్షకుల నుండి దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సాహో' బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగ రాస్తుందని ఊహించిన ట్రేడ్ పండితుల ఊహల్ని కల్లలు చేసింది. బాలీవుడ్ ఫ్లేవర్ బాగా మిక్స్ అయ్యి ఉండడం, హీరోయిన్ శ్రద్ధాకపూర్ కావడంతో హిందీలో 100 కోట్లు ఈజీగా క్రాస్ చేయగలిగింది 'సాహో'.