రెండో సినిమాకే ప్రభాస్ తో జట్టు కట్టే ఛాన్స్ కొట్టేశాడు సుజిత్. అయితే.. `సాహో` అంచనాల్ని అందుకోలేకపోయింది. ఓ మంచి అవకాశాన్ని సుజిత్ వృథా చేసుకున్నాడన్న విమర్శలొచ్చాయి. కానీ.. సుజిత్ పై `సాహో` నిర్మాతలు భరోసా ఉంచారు. మరో ఛాన్స్ ఇచ్చారు.యూవీ క్రియేషన్స్ లోనే సుజిత్ మరో సినిమా చేయబోతున్నాడు. గత కొంతకాలంగా యూవీతోనే ట్రావెల్ చేస్తున్నాడు సుజిత్. ఓ కథ కూడా రెడీ చేసుకున్నాడు. కానీ హీరోనే దొరకడం లేదు. ఎట్టకేలకు సుజిత్ హీరోని పట్టేశాడని టాక్.
సుజిత్ ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. యూవీలో గోపీచంద్ ఇది వరకు `జిల్` అనే సినిమా చేశాడు. ఆ సినిమా స్టైలీష్‌గా ఉన్నా, బాక్సాఫీసు దగ్గర పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే యూవీ బ్యానర్‌లో మరో సినిమా చేయాలని గోపీచంద్ ఫిక్సయ్యాడు. సుజిత్ చెప్పిన కథ, గోపీచంద్ కీ బాగా నచ్చిందని, ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం `సిటీమార్`తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.