దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మరోవైపు సుకుమార్ 'రంగస్థలం' విజయాలతో సూపర్ ఫామ్ లో ఉండడంతో 'పుష్ప' సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాపై ఈ మధ్య కథాచౌర్యం ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. వేంపల్లి గంగాధర్ అనే ఒక రచయిత తన కథను కాపీ కొట్టి 'పుష్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని పరోక్షంగా విమర్శిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ఆరోపణలపై మిశ్రమస్పందన వ్యక్తం అవుతోంది. కొందరేమో ఆ రచయిత ఆరోపణలను నమ్ముతూ అతనికి మద్దతు ప్రకటిస్తున్నారు, కొందరు మాత్రం సుకుమార్ టీమ్ కు మద్దతిస్తున్నారు. అయితే ఈ వివాదం పై ఇంతవరకూ దర్శకుడు సుకుమార్ స్పందించలేదు. ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఈ వివాదంపై స్పందించాల్సిన అవసరం లేదని దర్శకుడు సుకుమార్ అభిప్రాయపడుతున్నారట. వేంపల్లి గంగాధర్ రాసిన పుస్తకాలను తాను చదివానని, తన సినిమాకు ఆ కథలకు ఎటువంటి సంబంధం లేదని సుకుమార్ తన సన్నిహితులతో అంటున్నారట. కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ అంశం తప్ప మరే ఇతర విషయంలోనూ పోలిక ఉండదని అంటున్నారు.
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులే ఆ విషయం అర్థం చేసుకుంటారని ఇప్పుడు ఈ అంశంపై స్పందించి వివాదాన్ని పెద్దది చేయడం అవసరం లేదని ఆయన భావిస్తున్నారట. మరోవైపు సుకుమార్ అభిమానులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశమని, దానిపై ఇప్పటికే మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయని, ఆ ఒక్క అంశం మాత్రమే ఆధారంగా చేసుకుని 'పుష్ప' సినిమా కాపీ అని ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు.