'సుమన్ నటించిన నూరవ సినిమా' అంటూ ఓ భక్తి చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. దాంతో.. సుమన్ ఇంకా సెంచరీ కొట్టలేదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 'అయ్యప్ప కటాక్షం' అనే ఓ భక్తి సినిమా ప్రచారంలో సుమన్ నటించిన 100వ సినిమా అని పేర్కొంటుండడం అందరి దృష్టినీ అమితంగా ఆకర్షిస్తోంది. కానీ విషయం ఏమిటంటే.. 'అయ్యప్ప కటాక్షం' అనే సినిమా సుమన్ హీరోగా నటించిన నూరవ సినిమా. మళ్ళీ ఇందులోనూ మరో మెలిక ఉంది. అదేమిటంటే.. సుమన్ హీరోగా తెలుగులో హీరోగా నటించిన 100వ సినిమా 'అయ్యప్ప కటాక్షం'. అన్ని భాషలూ కలిపి సుమన్ నటించిన సినిమాల సంఖ్యా 500కు చేరువలో ఉంది. సుమన్ నటించగా తెలుగులో విడుదలైన సినిమా 'తరంగిణి' అయినప్పటికీ.. అతను తెలుగులో చేసిన మొదటి సినిమా 'ఇద్దరు కిలాడీలు'. భానుచందర్ మరో హీరో.
తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన ఈ చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకుడు. తరంగిణి, నేటి భారతం, ముక్కుపుడక వంటి సూపర్ హిట్స్ తో ఒక దశలో చిరంజీవికి సైతం పోటీ ఇచ్చిన సుమన్, మధ్యలో జైలు పాలై.. బయటకు వచ్చాక మళ్ళీ హీరోగా మంచి సినిమాలు చేశాడు. రాఘవేంద్రరావు, నాగార్జునల 'ఆన్నమయ్య'తో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇప్పుడు 'అయ్యప్ప కటాక్షం'లో చాలాకాలం తరువాత హీరోగా నటించి తెలుగులో సెంచరీ కొడుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది!!