సుమంత్ అక్కినేని చాలా కాలం తర్వాత 'నరుడా డోనరుడా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు సుమంత్. కానీ ఆ కాన్సెప్ట్‌ని మన తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేదు. దాంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు.
తాజాగా 'మళ్లీ రావా' చిత్రంతో తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకోనున్నాడు సుమంత్. గౌతమ్ తిననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో రూపొందుతోంది ఈ చిత్రం. ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ విడుదలైంది. పోస్టర్లో నీలి ఆకాశం, ఆ ఆకాశంలో హాయిగా విహరిస్తున్న రెండు ప్రేమ పక్షులు, బ్యాక్ గ్రౌండ్లో ఓ బిల్డింగ్, ఇద్దరు ప్రేమికులు కూర్చొని జాలీగా మాట్లాడుకుంటోన్న దృశ్యం.. ఇదీ పోస్టర్.
చాలా ఆహ్లాదంగా డిజైన్ చేశారు పోస్టర్ని. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. డిఫరెంట్ స్టోరీ జోలికి వెళ్లి బోల్తా పడిన సుమంత్, క్యూట్ రొమాంటిక్ స్టోరీనే నమ్ముకున్నట్లు తెలియవస్తోంది. ఈ సినిమాతో మళ్లీ సుమంత్ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. 'నరుడా డోనరుడా' చిత్రం ఫెయిల్ కావడంతో సుమంత్ ఇక నటనకు టాటా బైబై చెప్పేసి, తనకిష్టమైన నిర్మాణ రంగం వైపు మొగ్గు చూపిస్తాడనీ అంతా అనుకున్నారు. కానీ సైలెంట్‌గా సినిమా ఓకే చేసేయడం, పూర్తి చేసేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు సుమంత్ ఆశలన్నీ ఈ సినిమా పైనే. డిశంబర్ 8న 'మళ్లీ రావా' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.