'గోదావరి' సినిమా చూస్తే ఏమనిపిస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన ప్రేమ, ఆహ్లాదమైన లొకేషన్స్ అన్నీ ఆలా కుదిరాయి ఆ సినిమాకి. ఈ సినిమా చూస్తుంటే, ఎంతటి ఒత్తిడినైనా పక్కన పెట్టేసి, సినిమాని హాయిగా ఎంజాయ్ చేసేయొచ్చు. అలాంటిదే తాజాగా రాబోతున్న 'మళ్లీ రావా'. సుమంత్ హీరోగా నటిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్ సుమంత్‌తో జోడీ కడుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రాహుల్ యాదవ్ నిర్మాతగా పని చేస్తున్నారు.
ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే 22 సినిమాల్లో నటించిన సుమంత్‌కి ఈ సినిమా చాలా ప్రత్యేకం అంటున్నాడు. ఇన్ని సినిమాల్లో ఎన్నో పరాజయాలు, కొన్ని మాత్రమే విజయాలున్నప్పటికీ, వాటిలో 'సత్యం', 'గోదావరి', గోల్కొండ హైస్కూల్ చిత్రాలు తనకి సంతృప్తినిచ్చాయట. అలాగే వాటి కోవలోకి చెందిన చిత్రమే ఈ 'మళ్లీ రావా' అంటున్నాడు. ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇది అంటున్నాడు సుమంత్. సుమంత్‌కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం. అయినా యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్‌తోనే యాక్టింగ్‌ని వదిలి పెట్టలేకపోతున్నాడు.
గతంలో 'నరుడా డోనరుడా' చిత్రంతో ఓ ప్రయోగం చేశాడు. అయితే ఆ ప్రయోగం మన తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాంతో క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో మళ్లీ బరిలోకి దిగాడు సుమంత్. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ట్రైలర్ చూసి ఇదేదో సీరియస్ మూవీ అనుకునేరు. సినిమాలో చాలా కామెడీ ఉందట. హెల్దీ హెల్దీ కామెడీ అట. ఆడియన్స్ పక్కాగా ఎంజాయ్ చేస్తారట. అదీ సంగతి. మొత్తానికి 'మళ్లీ రావా' సినిమాతో సుమంత్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి మరి.