సునీల్ - త్రివిక్రమ్ మధ్య అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇద్దరూ మంచి స్నేహితులు. చాలా కాలం ఒకే రూములో ఉన్నారు. సునీల్ కెరీర్ స్థిరపడడానికి త్రివిక్రమ్ ప్రధానకారణం. తన సినిమాల్లో సునీల్‌కి మంచి మంచి పాత్రలు రాశాడు. రాస్తున్నాడు కూడా. అయితే సునీల్ కి విలన్ పాత్రలు పోషించాలని చాలా కోరికగా ఉండేది. విలన్ అవుదామనే పరిశ్రమలోకి వచ్చాడు. కానీ... త్రివిక్రమ్ సలహాతో హాస్యనటుడి అవతారం ఎత్తాడు. త్రివిక్రమ్ సినిమాలో ఎప్పటికైనా సునీల్ విలన్‌గా కనిపిస్తాడని అనుకున్నారు. కానీ ఆ అవకాశం రవితేజ ఇచ్చేశాడు.
రవితేజ - విఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం డిస్కోరాజా. శుక్రవారం విడుదలైంది. ఇందులో నెగిటీవ్ క్యారెక్టర్నిపోషించాడు సునీల్. ముందు పాజిటీవ్‌గా కనిపిస్తూ, ఆ తరవాత నెగిటీవ్‌గా మారే పాత్ర ఇది. అయితే చిత్రబృందం దాన్ని రహస్యంగా ఉంచింది. ముందు నుంచీ ప్రచారం చేసుకుంటే.. బాగుండేది అయినా. అది ట్విస్టు కాబట్టి సరిపెట్టుకోవాలి. కాకపోతే డిస్కోరాజా హిట్టయితే సునీల్ కెరీర్‌కి బాగా ఉపయోగపడేది. విలన్‌గా అవకాశాలూ వచ్చేవి. కానీ.. ఫలితం నిరాశ పరిచింది. అలా.. సునీల్ ప్రయత్నం, ప్రయోగం విఫలమైనట్టే.