కమెడియన్‌గా డిఫరెంట్ టైమింగ్‌తో ఆకట్టుకున్న సునీల్ 'అందాల రాముడు' సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. తొలి సినిమా ఫర్వాలేదనిపించినా, 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా సరికొత్త స్టార్‌డమ్‌ని సంపాదించుకున్నాడు. రెండో సినిమాకే రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించే అదృష్టం రావడం, ఆ సినిమా ఘన విజయం సాధించడం, ఆ తర్వాత వచ్చిన 'పూల రంగడు' సినిమా కూడా మంచి విజయం సాధించడంతో హీరోగా సునీల్ రేంజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది.
అయితే ఆ తర్వాత నుండీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. వరుస సినిమాలు చేసినా, ఒక్కొక్కటిగా నిరాశపరచడంతో హీరోగా సునీల్ సందిగ్ధంలో పడ్డాడు. తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రీసెంట్‌గా అల్లరి నరేష్‌తో 'సిల్లీ ఫెలోస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ఎలాగోలా నెట్టుకెళ్లిపోయింది. ఇకపోతే 'అరవింద సమేత..'తో మళ్లీ కమెడియన్‌గా పూర్వ అవతారాన్ని పునికి పుచ్చుకున్నాడు. ఆ సినిమాలో సునీల్‌కి మంచి పాత్ర దక్కింది. తన స్నేహితుడు త్రివిక్రమ్ పుణ్యమా అని అలా సునీల్ బౌన్స్‌బ్యాక్ అయ్యాడు.
ఇకపై సునీల్ వరుసగా కామెడీ రోల్స్‌నీ, ఇంపార్టెంట్ రోల్స్‌నే ఎంచుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. హీరో గెటప్స్‌ని పక్కన పెట్టేశాక సునీల్‌కి వరుస అవకాశాలు వస్తున్నాయి. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో సునీల్ స్టన్నింగ్ రోల్ పోషిస్తున్నాడు. అలాగే ఒక్కటేమిటి ఇప్పుడు సునీల్ ఖాతాలో ఇలాంటి రోల్స్ చాలానే ఉన్నాయి.
ఇకపోతే హీరో రోల్స్‌ని వదిలేశాక, సునీల్ ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తోంది. బాగా బరువు పెరిగాడు. హీరోగా 'పూలరంగడు' సినిమా కోసం కష్టపడి సిక్స్‌ప్యాక్ శరీరాన్ని కూడా పొందిన సునీల్ ఇప్పుడు పెరిగిన బరువు చూస్తుంటే ఇక భవిష్యత్తులో హీరో క్యారెక్టర్స్‌కి నీళ్లొదిలేసినట్లేనేమో అనిపిస్తోంది. అయితే ఈ విషయమై సునీల్‌ని అడిగితే మంచి కథ దొరికితే ఖచ్చితంగా మళ్లీ హీరోగానూ ట్రై చేస్తానని సమాధానమిచ్చాడు.