అత్తారింటికి దారేది.... టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఇప్పటికీ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ మూవీ. ఈ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం విశాల్‌కి వచ్చింది. కానీ తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల వదులుకోవాల్సివచ్చింది. మిర్చి రీమేక్ కూడా విశాల్ చేయాల్సిందే. కానీ అదీ వీలు కాలేదు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా వెల్లడించాడు.
అత్తారింటికి దారేది, మిర్చి ఈ రెండు కథలూ నా దగ్గరకు వచ్చాయి. కానీ చేయలేకపోయాను. టెంపర్ రీమేక్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడని ఫిక్సయ్యాను. ఇందులో ఎన్టీఆర్ పాత్ర నాకు బాగా నచ్చింది. ఎన్టీఆర్ కూడా అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ నటనతో పోటీ పడలేను. కానీ న్యాయం చేయగలను అనే నమ్మకం ఉంది'' అని చెప్పుకొచ్చాడు విశాల్.
తను కథానాయకుడిగా నటించిన 'పందెం కోడి 2' ఇటీవలే విడుదలైంది. రివ్యూలు ఈ సినిమాని చీల్చి చెండాడినా.. మాస్ సెంటర్లలో మాత్రం మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఆ స్ఫూర్తితోనే `పందెం కోడి 3` కూడా తీస్తానని ప్రకటించాడు విశాల్.