సూపర్ స్టార్ మహేష్‌బాబు, జనసేన పార్టీలో చేరిపోయినట్టుంది ఫొటో చూస్తోంటే. అవును మరి, ఇప్పుడిది ఎన్నికల సీజన్ కదా! పైగా, గాజు గ్లాసు పేరు మార్మోగిపోతోందిప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. పవన్‌కళ్యాణ్ అభిమానుల కారణంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తుకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. దాంతో ఎవరు గాజు గ్లాసులో టీ తాగుతున్నా, వాళ్ళందరికీ జనసేన 'కలర్' అంటించేస్తున్నారు.
అలా, 'మహర్షి' సినిమా తాజా లుక్‌లో మహేష్, గాజు గ్లాసుతో కనిపించేసరికి జనసేన రంగు అంటేసిందంతే. ఇదిలా వుంటే, సినీ రంగంలో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు మంచి స్నేహితులు. కొంత కాలం క్రితం మహేష్ సినిమా ఒకటి పైరసీకి గురైతే, మహేష్ తరఫున పవన్‌కళ్యాణ్ రంగంలోకి దిగి, పైరసీకి వ్యతిరేకంగా నినదించిన సంగతి చాలామందికి తెలుసు. రాజకీయాల్లో ఎవరి దారి వారిదే. పవన్‌కళ్యాణ్, జనసేన పార్టీ అధినేతగా వున్నారు.
మహేష్ మాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా వున్నారు. మహేష్ తండ్రి కృష్ణ, ఒకప్పటి కాంగ్రెస్ నేత. ఆ విషయాలు పక్కన పెట్టి 'మహేష్' కొత్త సినిమా 'మహర్షి' విషయానికొస్తే, రేపే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఈవెంట్ కోసం. చరణ్, ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారనే ప్రచారాలు జరుగుతున్న సంగతి తెల్సిందే.