స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘సైరా’ నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయడానికి కొంత సమయం తీసుకున్న విషయం విదితమే. నిజానికి, చరణ్‌తో సురేందర్ రెడ్డి ఇంకో సినిమా చేయాల్సి వుంది. వీరిద్దరి కాంబినేషన్లో ‘ధ్రువ’ సినిమా వచ్చింది. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కించాడాయన. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ అయ్యింది. దాంతోపాటుగా అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి ఇంకో ప్రాజెక్ట్ ఖరారు చేసుకున్నాడు.
ఇదిలా వుంటే, నితిన్‌తో కూడా సురేందర్ ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా ఖబర్. మరోపక్క, ఓ యంగ్ హీరోతో ఓ చిన్న సినిమా చేయాలనే ప్లాన్‌లో వున్నాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా ప్రకటన కూడా అతి త్వరలోనే రాబోతోందని సమాచారం.
అఖిల్ తాజా సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఇంకొంత ఆలస్యమయ్యేలా వుండడం సహా పలు కారణాలతో, సురేందర్ రెడ్డి ఓ కొత్త ప్రాజెక్ట్ సైన్ చేశాడని అంటున్నారు. అయితే, ఈ విషయమై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవితో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచన తనకు వుందని అప్పట్లో సురేందర్ రెడ్డి వ్యాఖ్యనించిన విషయం విదితమే. కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించాలనే ఆలోచనతో చరణ్ ఇప్పటికీ వున్నాడట.