ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఈ మధ్య చిన్న సినిమాలకే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలోనే తమ బ్యానర్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతోందనే విషయాన్ని ఆయన తాజాగా స్పష్టం చేశారు.
ఆ సినిమా ఇంకేదో కాదు, విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్‌లో రాబోతున్న మల్టీ స్టారరే. ఈ సినిమాకి 'వెంకీ మామ' అనే టైటిల్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. అదే టైటిల్‌ని ఈ సినిమాకి అనుకుంటున్నామనీ నిర్మాత సురేష్‌బాబు మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. అయితే అఫీషియల్‌గా డిక్లేర్ కాలేదు కానీ, ఇదే టైటిల్ ఫిక్స్ కానుందని మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న సినిమాలన్నీ మల్టీ స్టారర్ సినిమాలే కావడం విశేషం.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2' చిత్రంలో నటిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'పటాస్', 'సుప్రీమ్' చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా 'వెంకీ మామ' విషయానికి వస్తే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో రియల్ లైఫ్ మామా అల్లుళ్లైన వెంకీ, చైతూ రీల్ లైఫ్‌లో కూడా మామా అల్లుళ్లలాగే కనిపించనున్నారనీ టైటిల్ పరంగా తెలుస్తోంది.
ఈ సినిమాలో వెంకీ, చైతూతో జత కట్టబోయే ముద్దుగుమ్మల కోసం వేట కొనసాగుతోంది. తేజ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం వెంకీకి జోడీగా ముద్దుగుమ్మ శ్రియని అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఈ జోడీ మిస్ అయ్యింది. ఒకవేళ 'వెంకీ మామ' కోసం శ్రియను తీసుకొస్తారేమో చూడాలి మరి.