సినిమా షూటింగులు చేసుకునేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతులను ఇచ్చాయి. కొంతమంది ఫిల్మ్ మేకర్లు షూటింగ్ లను కూడా ప్రారంభించారు. అయితే కొందరు నిర్మాతలు, స్టార్ హీరోలు మాత్రం ఇప్పటివరకు తమ సినిమా షూటింగులను ప్రారంభించే ఆలోచనలో లేరు. ఈ అంశంపై మాట్లాడుతూ సీనియర్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ తన సినిమాలను మాత్రం మరో మూడు నెలల పాటు మొదలు పెట్టనని సురేష్ బాబు అంటున్నారు.
ప్రస్తుతానికి తన యూనిట్ సభ్యుల ఆరోగ్యం తనకు ముఖ్యమని, దానికి గ్యారంటీ ఇచ్చే పరిస్థితుల్లో తాను లేను కాబట్టి షూటింగును ప్రారంభించడం లేదని చెప్పారు. తమ బ్యానర్లో నిర్మిస్తున్న సినిమాకు 27 రోజుల పాటు షూటింగ్ పెండింగ్ ఉందని, అయితే అవన్నీ యాక్షన్ సీక్వెన్సులని చెప్పారు. దీంతో ప్రతి రోజూ 100 నుంచి 150 మంది షూటింగ్ లొకేషన్లో ఉండాల్సి వస్తుందని, అంతమంది ఒకే చోట భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు పెట్టుకోకుండా ఉండడం వీలుకాదని, అందుకే షూటింగు ఆలోచన విరమించుకున్నానని తెలిపారు.
మరి టీవీ కార్యక్రమాల షూటింగులు జరుగుతున్నాయి కదా అని ప్రశ్నిస్తే, టీవీ వారు షూట్ చేస్తే వారికి రోజుకి 50 వేల రూపాయలు లాభం వస్తుందనే గ్యారెంటీ ఉంటుందని, అదే సినిమా వాళ్లకు అలాంటి గ్యారెంటీ ఉండదని చెప్పారు. అంతేకాదు, షూటింగులు చేసుకోగలిగే ధైర్యం ఉన్నవారు చేసుకోవచ్చని తనకు మాత్రం ఆ ధైర్యం లేదని చెప్పారు.