బడా నిర్మాతలంతా ఓటీటీలు ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ `ఆహా` అనే వేదిక స్థాపించారు. దిల్ రాజు ఈ దిశగా అడుగులేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు సురేష్ బాబు కూడా రంగంలోకి దిగిపోతున్నారు. నిర్మాణం, పంపిణీ రంగంలో గత మూడు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. ఇప్పుడు ఓటీటీ ని ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ముంబైలోని ఓ సంస్థతో టై అప్ అవ్వడానికి చర్చలు మొదలెట్టారని తెలుస్తోంది. త్వరలోనే ఛానల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.
``ఓటీటీ బలమైన వేదిక. వెండి తెరకు మరో ప్రత్యామ్నాయం అవుతోంది. ఈ వ్యాపారంలోని లాభ నష్టాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాం. ఓ టీమ్.. ఈ విషయంపై పని చేస్తోంది. త్వరలోనే ఓ మంచి వార్త వింటారు`` అని సురేష్ బాబు చెబుతున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఓటీటీలకు అలవాటు పడిపోయారు. బీ,సీ ప్రేక్షకులు కూడా ఓటీటీని అర్థం చేసుకుంటే.. తప్పకుండా ఓటీటీకి మంచి రోజులు వచ్చినట్టే. కాకపోతే.. థియేటర్ వ్యవస్థపై ఇది చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. దాన్నుంచి సినిమా ఎలా బయటపడుతుందో ఏమో..?