సంక్రాంతి పండక్కి వచ్చిన తెలుగు సినిమాలు బాగా నిరాశపరిచేశాయి. 'అజ్ఞాతవాసి' పరాజయంతో మొదలైన సంక్రాంతి సంబరాల్లో, 'జై సింహా', 'రంగుల రాట్నం' ఇవేవీ గత ఏడాది వచ్చిన సంక్రాంతి హిట్స్ స్థాయిని అందుకోలేకపోయాయి. 'ఖైదీ నెంబర్ 150', 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'శతమానం భవతి' చిత్రాలు 2017 సంక్రాంతికి వచ్చి, ఘనవిజయాల్ని అందుకున్న సంగతి తెలిసినదే. దేనికదే గొప్ప చిత్రం అనే స్థాయిలో ఆ సినిమాలు విజయాల్ని అందుకుని, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి.
సినిమా సక్సెస్‌ల సంగతి పక్కన పెడితే, ఆయా సినిమాల ప్రమోషన్‌తో న్యూస్ ఛానెళ్ళ నిండా సెలబ్రిటీలు కనిపించి సందడి చేశారు. కానీ ఆ ఏడాది అటు థియేటర్లలో సందడి కానరాక, ఇటు న్యూస్ ఛానళ్ళలోనూ పెద్దగా సినీ ప్రముఖులు కనిపించక ఒకింత భిన్నమైన వాతావరణం కనిపించింది. అయితే తన సినిమా ప్రమోషన్ కోసం తమిళ హీరో సూర్య సక్సెస్ టూర్ నిర్వహించడం ఈ సంక్రాంతికి స్పెషల్‌గా చెప్పుకోవచ్చు.
'గ్యాంగ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య, పనిలో పనిగా సొసైటీకి మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. తాను వచ్చే దారిలో బైక్ ర్యాలీ చూశాననీ, ఒక్కరంటే ఒక్కరూ ఆ ర్యాలీలో హెల్మెట్ పెట్టుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు సూర్య. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. 'నా సోదరులు' అంటూ ఈ విషయాన్ని చెప్పి, అందరి మనసుల్నీ సూర్య 'టచ్' చేశాడు. 'గ్యాంగ్' సినిమా సక్సెస్‌ని ప్రేక్షకులతో కలిసి పంచుకునేందుకు సక్సెస్ టూర్ చేపట్టామని సూర్య చెప్పడం గమనించదగ్గ అంశం.
'అజ్ఞాతవాసి' ప్రమోషన్‌కి హీరో పవన్‌కళ్యాణ్‌తో సహా, చిత్ర యూనిట్ ఎవరూ ముందుకు రాలేదు. హీరోయిన్లు కూడా న్యూస్ ఛానళ్ళలో కన్పించలేదు. ఉన్నంతలో బాలయ్య 'జై సింహా' టీమ్ మాత్రం టీవీల్లో బాగానే కనిపించారు.