'సింగం' సిరీస్‌లో 'మూడో' సినిమా తర్వాత ఇంకోటి ఉండబోదని సంకేతాలు పంపారు హీరో సూర్య, దర్శకుడు హరి. 'సింగం-3' సినిమా విడుదలకు ముందు వివాదాల వల్లనే కావొచ్చు వారు అలా మాట్లాడింది. అయితే 'సింగం-3' విడుదలైన తర్వాత ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌తో, ఈ సిరీస్‌లో ఇంకొన్ని సినిమాలు తీయాలనే నిర్ణయానికి వచ్చారు. త్వరలో 'సింగం-4' సినిమా ఉంటుందని స్వయంగా హీరో సూర్య ప్రకటించాడు. అలాగే దర్శకుడు హరి కూడా 'సింగం-4' కథ రెడీ చేస్తానని చెప్పాడు. సినిమా ప్రమోషన్ కోసమే కాదట నిజంగానే 'సింగం-4' సినిమా ఈ ఇద్దరూ చేయాలనుకుంటున్నారని సమాచారమ్. అయితే సినిమా సినిమాకీ హీరోయిన్ అనుష్క పాత్ర తగ్గిపోతోంది. ఆమె స్థానంలో కొత్త హీరోయిన్లకు ప్రాధాన్యత పెరుగుతుంది. అది కూడా గ్లామర్ కోసమే కావడం గమనించదగ్గది. హీరో పాత్రతోపాటు హీరోయిన్ పాత్రనీ దర్శకుడు సరిగ్గా తీర్చిదిద్దగలిగితే 'సింగం' సిరీస్ ఇంకా పాపులర్ అవుతుంది. 'సింగం'లో అనుష్క మాత్రమే నటించగా, 'సింగం-2' సినిమాలో అనుష్క, హన్సిక నటించారు. 'సింగం-3' సినిమాకొచ్చేసరికి హన్సిక స్థానంలో శృతిహాసన్ వచ్చి చేరింది. 'సింగం-4'లో అనుష్క ఉంటుందా? శృతిహాసన్ కొనసాగుతుందా? ఇంకో కొత్త హీరోయిన్ ఎవరు అవుతారు? అనే ప్రశ్నలకు చిత్ర యూనిట్ ఆస్కారం కల్పించింది. ఏదేమైనప్పటికీ 'సింగం' సిరీస్‌పై అంచనాలు ఒకప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడు కొంత మేర తగ్గాయని చెప్పక తప్పదు. ఇక్కడ స్వీట్ షాక్ ఏంటంటే 'సింగం-4' రావడానికి నాలుగైదేళ్ళు పడుతుందట.