ఈమధ్య సూర్య సినిమాలకు టాలీవుడ్‌లో గిరాకీ బాగా తగ్గిపోయింది. తనకు పట్టున్న బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల్ని కూడా సూర్య మెప్పించలేకపోతున్నాడు. తాజాగా `ఎన్‌జీకే` (నందగోపాల కృష్ణ) కూడా డిజాస్టర్ల లిస్టులో చేరిపోయింది. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీరాఘవ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాని 9 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే చివరికి 4.5 కోట్లు మాత్రమే సాధించింది. అంటే... ఈ సినిమా కొన్న నిర్మాతకు సగానికి సగం నష్టమన్నమాట. సూర్య నటించిన సింగం, యముడు, 24 మంచి వసూళ్లు సాధించాయిక్కడ. యావరేజ్ టాక్ తెచ్చుకున్న గ్యాంగ్ కూడా 8 కోట్ల వరకూ తెచ్చుకుంది.
ఆ నమ్మకంతోనే ఈ సినిమాకి 9 కోట్లకు కొన్నారు. అయితే.. తొలి రోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకోవడంతో సగానికి సగం పోయింది. నైజాంలో ఈ సినిమా 1.20 కోట్లు తెచ్చుకుంది. సీడెడ్ లో 77 లక్షలు వచ్చాయి. గుంటూరులో 49 లక్షలు సాధించింది. కృష్ణలో రూ.45 లక్షలొచ్చాయి. ఈ అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా కొన్న పంపిణీదారులు నష్టపోయారు. తమిళంలోనూ పరిస్థితి ఇలానే ఉంది. కాకపోతే.. అక్కడ నష్టాల భారం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.