ఈ వేసవిలో సినిమాలు బాగానే వరుస కడుతున్నాయి. అయితే బాక్సాఫీసు దగ్గర మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోతున్నాయి. ఈ సీజన్‌లో తెలుగు చిత్రసీమకు ఒకే ఒక్క హిట్టు దొరికింది. అదీ... మహర్షి రూపంలో. మహర్షి తరవాత చాలా సినిమాలొచ్చాయి. కానీ ఏదీ నిలబడలేకపోతోంది. ఈవారం కూడా మూడు సినిమాలు వరుసకట్టాయి. అయితే.. ఫలితం శూన్యం. మూడు సినిమాల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా.. ఎన్.జీ.కే (నందగోపాలకృష్ణ). సూర్యకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.
వరుసగా ఫ్లాపులు ఇస్తున్నా - సూర్య సినిమాని కొనడానికి జనం ముందుకు వస్తూనే ఉన్నారు. పైగా శ్రీరాఘవ దర్శకత్వం వహించిన సినిమా ఇది. బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలతో శ్రీరాఘవ సత్తా తెలుగు ప్రేక్షకులకూ అర్థమైంది. దానికి తోడు రకుల్,సాయి పల్లవిలు కూడా ఈసినిమాలో ఉండడంతో - ఆ ఫోకస్ మరింత పెరిగింది. అయితే ఎప్పటిలానే సూర్య నిరాశ పరిచాడు. ఏమాత్రం బలం లేని కథ, ఆసక్తిలేని కథనంతో.. శ్రీరాఘవ విసుగెత్తించాడు. తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ బయటకు వస్తే... రెండు రోజులు ఆగేసరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాని తెలుగులో 8 కోట్లకు కొన్నారు. అందులో 2 కోట్లు కూడా వస్తాయే, రావో అన్నట్టుంది పరిస్థితి. సూర్య సినిమాకి వసూళ్లు ఇంత దారుణంగా ఉండడం తన కెరీర్‌లో ఇదే తొలిసారేమో. పక్కా హైదరబాదీ సినిమాగా `ఫలక్‌నుమాదాస్`ని ప్రచారం చేశారు. విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ఇది. ట్రైలర్లు, టీజర్లు అదరగొట్టేయడంతో సినిమాలోనూ ఏదో విషయం ఉందని ఆశించారు జనాలు. కానీ... థియేటర్లో మాత్రం తుస్సుమంది. అన్నామలై డైరీస్ అనే మలయాళ చిత్రానికి ఇది రీమేక్. పక్కా కాపీ పేస్ట్ రీమేక్. కాకపోతే.. తెలంగాణ నేపథ్యాన్ని జోడించారంతే. బూతులు ఎక్కువై, కథలో క్లారిటీ మిస్సై, బోరింగ్ సన్నివేశాలతో విసిగించింది. ఈ సినిమాకి రివ్యూలు కూడా నెగిటీవ్‌గానే వచ్చాయి.
కాకపోతే.. వసూళ్లు బాగున్నాయి. సింగిల్ స్క్రీన్ లో కలక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ సినిమా పెట్టుబడిని రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రభుదేవా - తమన్నాల సీక్వెల్ అభినేత్రి 2 గురించి ఒక్కరూ మాట్లాడుకోవం లేదు. దానికి కారణం.. సరైన పబ్లిసిటీ లేకపోవడమే. భారీ పబ్లిసిటీతో విడుదల చేసి అభినేత్రినే తెలుగులో సరిగా ఆడలేదు. అందుకే... పార్ట్ 2కి ప్రచార హడావుడి లేదు. దానికి తగ్గట్టుగా సైలెంట్‌గా వచ్చి, వెళ్లిపోయింది తమన్నా బొమ్మా. తమిళంలోనూ ఈ సినిమాని ఫ్లాప్‌గా తేల్చేశారు సినీ జనాలు.