తమిళ నాట బిజీగా ఉండే హీరోల్లో సూర్య ఒకడు. యేడాదికి రెండు మూడు సినిమాలు ఈజీగా చేసేస్తుంటాడు. చేతిలో ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అందుకే సూర్య క్షణం పాటు కూడా ఖాళీగా ఉండడు. ఇప్పుడు కూడా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో `వాడి వాసల్` ఒకటి. తమిళంలో చాలా పాపులర్ అయిన నవల ఇది. జల్లి కట్టు నేపథ్యంలో సాగుతుంది. సి.ఎస్.చప్పల రాశారు. ఇప్పుడు ఈ నవలని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమాని సూర్య పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు సూర్య. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి సూర్య బయటకు వచ్చేశాడు. ఇప్పుడు ఈ `వాడి వాసల్` సినిమానీ వదలుకొన్నాడని ప్రచారం మొదలైంది.
దీనిపై నిర్మాత కలైపులి ఎస్.థాను స్పందించారు. ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని ఊరికే వదిలేది లేదని హెచ్చరించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా అవ్వగానే.. `వాడి వాసల్` మొదలవుతుంది.