'ఒక మనసు'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది నిహారిక. `హ్యాపీ వెడ్డింగ్`లోనూ నటించింది. ఈ రెండు చిత్రాలూ నిహారిక లోని నటిని బయటపెట్టాయి గానీ, కమర్షియల్ విజయాల్ని ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేస్తోంది. అదే... 'సూర్యకాంతం'. ప్రణీత్ బి దర్శకత్వం వహించిన చిత్రమిది. నిర్వాణ సినిమా నిర్మించింది. వరుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
మార్చి 28న విడుదల అవుతోంది. ఈరోజు టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో సూర్యకాంతంగా నిహారిక అల్లరి కనిపిస్తుంది. డైలాగులలో, యాటిట్యూడ్‌లో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో చూపించారు. `ఏం పిల్లరా అది` అనే టైపులో క్యారెక్టర్‌ని తీర్చిదిద్దారు. సూర్యకాంతం ఓ ఫుట్‌బాల్ ప్లేయర్. తనని ప్రేమిస్తున్నా అని చెప్పిన వాడితో ఫుట్‌బాల్ ఆడేసుకుంటుంటుంది.
ఆఖరికి.. అమ్మతోనూ అంతే. `నేను అయిదు లెక్క పెట్టేలోపు నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే కోసుకుంటా` అని సుహాసిని బెదిరించినా సరే - ఆట పట్టిస్తుంటుంది. దాన్ని బట్టి నిహారిక పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. టీజర్ చాలా సరదాగా ఉంది. ఇదే ఫన్ తెరపైనా కనిపిస్తే... నిహానిక హిట్ కొట్టినట్టే.