బాలీవుడ్‌లో ఏం జరిగినా... దాని చుట్టూ ఓ కథ అల్లేసి, సినిమా తీసేసి. క్యాష్ చేసుకుందామని కొంతమంది ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. నిజానికి రాంగోపాల్ వర్మ ఈ విషయంలో ముందుంటాడు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా - దాని మీద ఓ సినిమా తీయడం, జనం దృష్టిని ఆకర్షించడం వర్మకి అలవాటే. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కూడా హిందీ సినిమా కథలకు కొత్త రెక్కలు ఇచ్చినట్టైంది.
ఈ ఆత్మహత్య చుట్టూ ఓ సినిమా తీసి క్యాష్ చేసుకుందామనుకుంటున్నారు. సుశాంత్ బయోపిక్ తీస్తానని, అందులో నిజాలు బయటపెడతాని కమల్ ఆర్.ఖాన్ చెబుతున్నాడు. వివాదాలంటే కమల్‌కి చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఎవరినో ఒకరిని కెలుకుతూ ప్రచారం తెచ్చుకుంటాడు. ఇప్పుడు ప్రశాంత్ ఆత్మహత్యపై మరింత వివాదం రాజేయడానికి రెడీ అయినట్టు కనిపిస్తోంది.
''ఒట్టేసి చెబుతున్నాను. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్ నిర్మిస్తాను. ఈ సినిమా ద్వారా సుశాంత్ మరణానికి కారణమైన నేరస్థులని బయటపెడతాను. బాలీవుడ్ ప్రజలని ద్వేషించడం నాకు చాలా ఇష్టం. సుశాంత్ కి న్యాయం జరగాలి'' అంటూ బయోపిక్‌కి రంగం సిద్ధం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే కమల్ కేవలం మాటల మనిషి. చేతల్లో చేసేదేం ఉండదు. ఈ ప్రకటన కూడా మాటలకే పరిమితం అని... అతని గురించి తెలిసిన వాళ్లు లైట్ తీసుకుంటున్నారు.