సుశాంత్ సింగ్ ఆత్మ హత్య అంశం కాస్తా.... డ్రగ్స్ కేసుగా రూపాంతరం చెందింది. అప్పట్లో నెపోటిజం గురించి మాట్లాడినవాళ్లు.. ఇప్పుడు డ్రగ్స్ కోణం దిశగా ఈ ఆత్మహత్యని తీసుకెళ్తున్నారు. సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేవాడని, తన కోసమే డ్రగ్ డీలర్ ని సంప్రదించానని రియా చక్రవర్తి చెబుతోంది. అయితే సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నాడన్నదానిపై ఎలాంటి ఆధారాలూ లేవు. ఒకప్పుడు సుశాంత్ సింగ్ దగ్గర కారు డ్రైవరుగా పని చేసిన ధీరేంద్ర యాదవ్ ని సీబీఐ విచారించింది. ఈ విచారణలో ధీరేంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టాడు.
సుశాంత్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, తానెప్పుడూ సుశాంత్ డ్రగ్స్ తీసుకోవడం చూడలేదని, తానెప్పుడూ ఆందోళనకు కూడా గురి కాలేదని, చాలా ఉత్సాహంగా ఉండేవాడని, కార్లో ఎక్కువగా సంగీతం వినేవాడని పేర్కొన్నాడు. సుశాంత్ కి స్నేహితులు కూడా తక్కువే అని, కారులో ప్రయాణిస్తున్నప్పుడు తన గురించి, తన కుటుంబ యోగ క్షేమాల గురించీ సుశాంత్ ఆరా తీసేవాడని చెప్పుకొచ్చాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే రకం కాదని, తను చాలా ధైర్యవంతుడని, చెడు స్నేహాలు ఎప్పుడూ చేయలేదని సీబీఐకి వివరించాడు. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు అని రియా తప్ప, ఇంకెవర్వరూ చెప్పడం లేదు. పోస్టు మార్టమ్ రిపోర్టులో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఉన్నాయా? అనే విషయంలో ఎలాంటి వివరణ లేదు. అలాంటప్పుడు రియా చెబుతున్న విషయాలు నిజమేనా? అనే మరో అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ కేసుని సీబీఐ ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.