చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. నిడివి 2 గంటల 44 నిముషాలుగా నిర్ణయించారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. 'సైరా నరసింహారెడ్డి' అనేది ఓ బయోపిక్. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర. చరిత్రను కొన్ని గంటల్లో చెప్పడమంటే అంత తేలికైన విషయం కాదు.
కానీ, 'సైరా'ని 2 గంటల 44 నిముషాలకు ఎడట్ చేశారంటే గొప్ప విషయమే అంటున్నారు. వాస్తవానికి 3 గంటల సినిమా ఉంటుందని అంతా భావించారు. మొన్న విడుదలైన 'గద్దలకొండ గణేష్' చిత్రం 2 గంటల 55 నిముషాలు అంటే దాదాపు 3 గంటల రన్ టైమ్‌ని ఫిక్స్ చేశారు. అలాంటిది ఓ చరిత్రని ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో సినిమా ధియేటర్‌లో సందడి చేయడానికి అవసరమైన అన్ని పనులు పూర్తయిపోయినట్లే. సైమల్టేనియస్‌గా ఎలాగూ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాపై ఓ రకమైన అంచనాకి వచ్చేశారు.
చిత్ర యూనిట్ సభ్యులతో పాటు, ఇండస్ట్రీలోని ఇతర సినీ ప్రముఖులు కూడా 'సైరా' విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేయడమే కాదు, చిరంజీవితో నిర్మాతగా రామ్‌చరణ్ అటెంప్ట్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చరిత్ర మర్చిపోయిన ఓ గొప్ప వీరుడి కథ, చరిత్రలో నిలిచిపోయేలా చిరంజీవి వంటి ఓ ఉన్నతమైన వ్యక్తి ద్వారా ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ సినిమాకి వీర స్వర్గం కాదు, విజయమే కట్టబెట్టాల్సిన బాధ్యత ఖచ్ఛితంగా ప్రతీ భారతీయుడు, ప్రతీ తెలుగోడి మీదా ఉంది.